September 16, 2007

సమాల్ విమర్శలు

దీన్లో జనానికి తెలియని కొత్త విషయాలు
ఏమున్నాయి సార్‌, గొప్పగా చెప్పిందేంటట?

సందర్భం:

''నా గురించి, నా సంస్థ గురించి ఒకమాట'' అంటూ నివేదికను మొదలు పెట్టిన సమాల్‌... తొలుత విజిలెన్స్‌ కమిషన్‌ పూర్వాపరాలు తెలిపారు. 1964లోనే ఏర్పడిందంటూ ''ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అఖిల భారత సర్వీసుల్లోని చాలామందికి విజిలెన్స్‌ కమిషనంటే ఏంటో తెలీదు. కమిషనర్‌ గురించీ తెలీదు. అధికారంలో ఉన్న నేతలకు నిఘా కమిషనర్‌ పాత్రపై అవగాహనే లేదు. వారికి వ్యక్తిత్వం లేదు. చట్ట నియమాలు పట్టవు. కార్యనిర్వాహక వర్గమే అత్యున్నతమైనదనే తప్పుడు భావనతో ఉన్నారు. వీలైనంత త్వరగా నాలుగు కాసులు వెనకేసుకోవాలనే యావ, సొంత లక్ష్యాలను... సొంత ఎజెండాను తప్ప దేన్నీ సాధించలేని అలవాటు, సంపాదన, వారికి రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌పై అవగాహన లేకుండాచేశాయి. కానీ తాము రామచంద్ర సమాల్‌ అనే సింహంపై స్వారీ చేస్తున్నామని వారు తెలుసుకోలేదు. ఆ సింహాన్ని నియంత్రించలేరు. వారి లక్ష్యాలేంటో వారికి తెలుసు. దానికి అనుసరించాల్సిన మార్గాలపై పట్టింపుల్లేవు'' అని తీవ్రంగా విమర్శించారు. వారి తీరు చూస్తే సమాధిలోని మహాత్మగాంధీ సిగ్గుతో మళ్ళీమళ్ళీ మరణిస్తారని పేర్కొన్నారు.
దేశంలో... ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిణామాలు చెబుతానంటూ... నిజాయితీగల అధికారులు అతికొద్దిమందే ఉన్నారని చెప్పారు. అభివృద్ధి పేరిట బ్యూరోక్రాట్లు నిర్వహిస్తున్న భారీ క్రీడలో భూమి రూపంలోని సమాజ సంపద అతివేగంగా తరిగిపోతోందని నిందించారు. హోంమంత్రి జానారెడ్డి గురించి కూడా సమాల్‌ ప్రస్తావించారు. ''ఇంటెలిజెన్స్‌ విభాగం ఆయన పూర్వాపరాలను విచారించి, ఆయన ఆ పదవికి పనికొస్తాడో లేదో ముఖ్యమంత్రికి చెప్పాలి. నేను రాజ్యాంగ చరిత్ర విద్యార్థిని. అనేక దేశాల రాజ్యాంగాల్ని చదివా. అమెరికా తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో రక్షణ మంత్రిని అధ్యక్షుడే నియమిస్తాడు. కానీ అతడి చరిత్రను సెనేట్‌ సమగ్రంగా చర్చిస్తుంది. అవసరమైతే అధ్యక్షుడి నియామకాన్ని తిరస్కరిస్తుంది కూడా. బ్రిటిష్‌ వ్యవస్థలో నేరస్థులు బాధ్యతాయుతమైన పదవి చేపట్టడానికి లేదు. నేరస్థులను రాజకీయాల్లోకి రానివ్వటం, రాజకీయాలను నేరమయం చేయటం మానాలి. దీనికి ఆంధ్రప్రదేశ్‌ మినహాయింపేమీ కాదు. దీని వల్ల పోలీసు విభాగంలోని నేరగాళ్ళు నీతిమంతులుగా, అమాయకులుగా ధ్రువపత్రాలు పొందుతున్నారు. ఇలాంటి జాబితా చాలా పెద్దదే ఉంది. దీన్ని పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి'' అని సమాల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయినా ట్రాఫిక్‌ పోలీసుల వంటి సాధారణ పోలీసు అధికారులపై కేసులు నమోదు చేయటంలేదని సమాల్‌ పేర్కొన్నారు. ''ఒకవేళ ఎవరైనా సిబ్బందిపై కేసులు నమోదు చేస్తే... జానా రెడ్డి నేతృత్వంలోని హోం శాఖ వారిని బయటపడేయటానికి సిద్ధంగా ఉంటుంది'' అని నిందించారు. గనులు, భూగర్భ శాఖ పనితీరును వర్ణించటానికి తనకు మాటలు రావటంలేదని సమాల్‌ పేర్కొన్నారు. ''ఆంధ్రప్రదేశ్‌ భూగర్భాన్ని... సముద్రంలోపల... సముద్రం బయట ఇంత వ్యవస్థీకృతంగా దోపిడి చేయటం ఎప్పుడూ చూడలేదు. దీనిని పరిశీలించాల్సింది తేల్చాల్సింది నిపుణులే'' అన్నారు.
ముఖ్యమంత్రి పేషీలో ఆయనకు ప్రిన్సిపల్‌ కార్యదర్శిగా ఉన్న వ్యక్తిపై సమాల్‌ విరుచుకుపడ్డారు. తాను సిబ్బంది కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపినా ఎవరూ పట్టించుకోలేదని, తామెంత బాగా పనిచేసినా... అవినీతి కార్యదర్శులను పొగిడే ప్రభుత్వం తమనుమాత్రం గుర్తించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. సదరు కార్యదర్శి హోదాను అడ్డంపెట్టుకుని ఆయన వియ్యంకుడు నానా అక్రమాలూ చేస్తున్నారని పేర్కొన్నారు. ''ఆయన గిరిజన సంక్షేమ శాఖలో చీఫ్‌ ఇంజినీరే. కానీ అటెండరుగా కూడా పనికిరాడు'' అని దుయ్యబట్టారు.
ఇతర శాఖల అవినీతి ఇదీ... ''జలయజ్ఞం జెట్‌ స్పీడ్‌లో సాగుతోంది. దీంతో అన్ని ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రస్తుత నాణ్యత నియంత్రణ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ప్రత్యామ్నాయం ఒక భ్రమ. అందరూ కాంట్రాక్టర్లుగా మారిపోయారు. ఐఏఎస్‌ అధికారి చంద్రభాను ప్రకాశిస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన శాఖలన్నిటికీ నీటిపారుదల శాఖ ఆదర్శంగా మారింది. రోడ్లు, భవనాల శాఖదీ అదే పరిస్థితి'' అని పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్‌ 18న ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో వి.ఎస్‌.పాండే అనే సివిల్‌ సర్వెంట్‌ రాసిన వ్యాసాన్నీ సమాల్‌ ప్రస్తావించారు.
ఏసీబీ తీరు దారుణం క్షేత్ర స్థాయి సిబ్బందిపై తప్ప ఉన్నతాధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేయటం లేదని, అమాయకులు వేధింపులకు గురవుతున్నారని సమాల్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ''ప్రస్తుత డీజీ కన్నా ముందున్న అధికారి అత్యాధునిక పరికరాలు కొన్నారు. అవిపుడు ఏసీబీకి ఉపయోగపడటం లేదు. ఇదో నిద్రపోతున్న అవినీతి సంస్థ. కొందరు మంచి అధికారులున్నా... వారిని సామర్థ్యం మేరకు పనిచేయనివ్వటం లేదు'' అన్నారు. ఏసీబీ నెలనెలా జిల్లాల వారిగా నివేదిక తయారుచేస్తుందంటూ... ''దీనిలో రహస్యంగా చేసిన విచారణలు, ఆకస్మిత తనిఖీలు, సాధారణ విచారణలు, నమోదైన కేసుల వివరాలుంటాయి. ఈ నివేదికనలు చూస్తే క్షేత్రస్థాయి సిబ్బందిపై వ్యక్తిగత కక్షలను తీర్చుకోవటానికి కేసులు నమోదు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తుంది'' అని సమాల్‌ విమర్శించారు. విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్‌లలోని ప్రత్యేక కోర్టుల్లో- ఛార్జి షీట్లు దాఖలు చేయటంలో అపరిమితమయిన జాప్యం జరుగుతోందన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంటూ అంతే... డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థనూ సమాల్‌ విమర్శించారు. ''దీన్ని 1985లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన ఆర్థిక, ఇతర నేరాలను దర్యాప్తు చేసే అధికారాల్ని కట్టబెట్టింది. దీనంత అసమర్థ సంస్థ మరొకటి లేదు. ఇలాంటి వాటివల్ల ప్రజాధన దుర్వినియోగం తప్ప మరేం జరగదు. ఈ సంస్థలో కనీసం 561 నుంచి 644 మంది సిబ్బంది ఖాళీగా కూర్చుంటున్నారు. ఇది అనవసరమైన నివేదికలు తయారుచేస్తుంది. అవి చెత్త బుట్టల్లో వేయటానికి తప్ప దేనికీ పనికిరావు. ఇలాంటి సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి'' అని పేర్కొన్నారు. గతంలో ఒకసారి ఈ సంస్థ సమర్థుడైన డీజీ నేతృత్వంలో బాగా పనిచేసిందని, ఇపుడు మాత్రం అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం డీజీ ఉత్సాహంగా ఈ సంస్థలో చేరారని, చేరినప్పటి ఉత్సాహం ఆయనలో ఇప్పుడు లేదని తెలిపారు.
ఎన్నెన్నో ప్రస్తావనలు... దేశంలో అవినీతికి సంబంధించి వివిధ న్యాయస్థానాలు చేసిన వ్యాఖ్యలను సమాల్‌ తన నివేదికలో ప్రస్తావించారు. ట్రాన్స్‌పరెన్సీ వంటి సంస్థలిచ్చిన ర్యాంకులనూ ఉదహరించారు. పలు కేసుల్లో తానెంత జాగ్రత్తగా పరిశీలించి శిక్షలకు సిఫారసు చేసిందీ వివరిస్తూ... కొందరు అధికారులు నిజాయతీగా వ్యవహరించటంవల్ల కేసుల పరిశోధన ఎంత సులభమైందో కూడా చెప్పారు. వారి పేర్లను ప్రస్తావించారు. కొన్ని కేసుల్లో తాము ఆయా విభాగాలకు సిఫారసులు చేసినా.... తరవాత వాటిని గుర్తు చేస్తూ లేఖలు రాసినా కూడా పట్టించుకోలేదంటూ కొన్ని సంఘటనల్ని ఉదహరించారు. అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునళ్ళను సమాల్‌ విమర్శించారు. అవి రిటైర్డ్‌ అధికారులకు పునరావాస కేంద్రాలవుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు పలుమార్లు ట్రిబ్యునళ్ళ పరిధులను వివరిస్తూ రూలింగ్‌లు ఇచ్చినా ఇప్పటికీ పలు ట్రిబ్యునళ్ళు తమకు సంబంధం లేని అంశాలపై ఉత్తర్వులిస్తున్నాయని చెప్పారు.
వివిధ విభాగాల్లో చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్లను, విజిలెన్స్‌ ఆఫీసర్లను నియమించకపోవటం, కొన్నిచోట్ల అసమర్థుల్ని నియమించటం తమ పనితీరుపై తీవ్రంగా ప్రభావం చూపిందని సమాల్‌ పేర్కొన్నారు. నిబంధనలప్రకారం వారి నియామకాలను విజిలెన్స్‌ కమిషనర్‌ ఆమోదంతో చేపట్టాల్సి ఉన్నా సమాచారం కూడా ఇవ్వకుండా కొందరిని నియమించి, విజిలెన్స్‌ కమిషన్‌ చెవులు, కళ్ళు మూసేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
సమాల్‌ వ్యాఖ్యలు మరికొన్ని... *కొన్నేళ్ళుగా చూస్తే అవినీతి, అక్రమార్జనతో ముడిపడిన కేసులు, నేరాలు పెరిగిపోతున్నాయి. ఆయా విభాగాల్లో ఈ కేసుల్ని చూడాల్సిన నిఘా విభాగాల సామర్థ్యం పడిపోతోంది. ఎక్కువమంది ఉద్యోగులుండే కీలక విభాగాలు తమ ఉద్యోగులపై అదుపు కోల్పోయాయి. నీటిపారుదల, రవాణా, రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి తదితర విభాగాల్లో బడ్జెట్‌ భారీగా పెరగటంతో పాటు వాటిని వేగంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాణ్యత మాత్రం ఎవరికీ పట్టడం లేదు. అత్యున్నత స్థాయుల్లో సమర్థులైన అధికారుల కొరత చాలా ఉంది. అసమర్థ, అవినీతి అధికారులవల్ల ఖజానా గుల్లవుతోంది. ప్రజా ధనం ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి పోతోంది.
*ఇక వాణిజ్య పన్నులు, ఎక్సైజు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, గనుల వంటి ఆదాయార్జన ఉండే విభాగాలది మరో దారి. వీటిల్లో టార్గెట్లు పెంచటంతో ఏడాదికేడాది రెవెన్యూ పెరిగిపోతోంది. అవినీతి ఈ విభాగాల మూలాల్లోకి చేరుతోంది. వీటన్నిటి ఫలితంగా వివిధ విభాగాల్లో విజిలెన్స్‌, అవినీతి నిరోధక సిబ్బందిపై పని భారం ఎక్కువైంది. తప్పుచేసినవారు తప్పించుకోవటం సులభమైంది. ఏసీబీ, విజిలెన్స్‌ వంటి దర్యాప్తు సంస్థల్లోనూ సమర్థత దారుణంగా క్షీణించింది. విపరీతమైన రాజకీయ ఒత్తిళ్ళు, బెదిరింపులతో ఈ విభాగాల అధిపతులు కళ్ళుమూసుకోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో ప్రతివారూ పనిచేయటం మాని ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయటం మొదలెట్టారు. తమ దగ్గరకొచ్చిన వారి పనులు చేసిపెట్టడానికి లంచాలు తీసుకోవటం మొదలెట్టారు. దీనికంతటికీ కారణం ఉన్నతాధికారులే.
అవినీతి బయటపడినా... ''కె.రమ అనే అధికారిణి విపరీతంగా అక్రమాస్తులు కూడబెట్టింది. నిజానికి కోర్టులో కేసు తేలేవరకూ ఆ అధికారిణిని సస్పెన్షన్‌లో ఉంచాలి. కానీ విజిలెన్స్‌ కమిషన్‌తోగానీ ఏసీబీతోగానీ సంప్రతించకుండా ఈమెకు మళ్ళీ పదవిచ్చేశారు'' అని సమాల్‌ తెలిపారు. ఇలాంటి నిర్ణయాల వల్ల అక్రమార్జన చేసేవారికి తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. ఆమెకు మళ్లీ ఉద్యోగమివ్వటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

No comments: